అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు తగల పెట్టాడు
1927 వ సంవత్సరం డిసెంబరు 25 న డాక్టర్ బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ మనుస్మృతి అత్యంత దుర్మార్గమైన, క్రూరమైన సిద్దాంతాలు కలిగి ఉన్నది అని భావించి తగల పెట్టాడు. తన తర్వాత తన స్నేహితుడు అయిన బ్రాహ్మణుడి చేత రెండవ వాడిగా తగల పెట్టించాడు.
మనుస్మృతి చేసిన తప్పులు ఏమిటి
1. విద్యా హక్కు:
వేలాది సంవత్సరాలుగా మన దేశంలో శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు , మహిళలకు విద్యాహక్కు లేకుండా మను స్మృతి చేసింది. ఈ నాలుగు వర్గాలను పీడిత వర్గాలు అని అందాము.
ఆనాటి విద్యాలయాల్లో గురుకుల ఆశ్రమాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే చదువుకునే వారు. ఈ ముగ్గురిని ఆధిపత్య వర్గాలు అని అందాము.
2. ఆస్తి హక్కు:
పీడిత వర్గాలకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు. ఉంటే ఎప్పుడయినా ఆధిపత్య వర్గాలు స్వాధీనం చేసుకునే హక్కు అట్టి పెట్టుకున్నారు.
3. మహిళలు:
తమ రాజ్యంలోని ప్రతి మహిళను క్షత్రియ రాజులు తమ స్వంత ఆస్తిగా భావించారు. తమ రాజ్యంలోని ఏ మహిళను అయినా ఎప్పుడు అయినా క్షత్రియులు, బ్రాహ్మణులు అనుభవించే హక్కు కలిగి ఉన్నారు.
ఇలాటి అనేక దుర్మార్గాలను స్మృతుల పేరుతో తమ రాజ్యాంగంగా ఆనాటి పాలకులు అమలు చేశారు. దీని ఫలితంగా
A) చాటుగా చదువుకున్న శూద్రుల నాలుకలు తెగ కోశారు, వేదాలు విన్న వారి చెవుల్లో సీసం కరగించి పోశారు. పురాణాలలో శూద్ర శంబూకుడు, సత్యకామ జాబాలి, ఏకలవ్యుడు, కర్ణుడు, చార్వాకులు మెదలయిన వారు అణచి వేయబడ్డారు.
B) మహిళలు అయితే వేలాది మంది అంతఃపురాలలో బంధించ బడ్డారు.
C) పీడిత వర్గాలు కూడపెట్టి సంపాదించిన ఆస్తులను దోపిడి దొంగల వలె దోచుకున్నారు.
D) ఆదివాసీలను వేట పేరుతో దాడి చేసి వారి నివాస ప్రాంతాల నుండి నిరంతరం తరిమి వేశారు
E) అనిత్య - అనాత్మ గురించి మరియు ప్రతి దానిని ప్రశ్నించమని బౌద్దం చెప్పింది. అలా చెప్పినందుకు వేలాది మంది బౌద్దులను కాల్చి చంపారు, గానుగులలో వేసి ఆడించారు.
“అందుకే మహాకవి శ్రీ శ్రీ పురాణాలలో , చరిత్రలో ఏమున్నది గర్వకారణం
అన్నార్తుల హాహాకారాలు, పీడితుల ఆక్రందనలు, మహిళలపైన హింస తప్ప” అని చెప్పాడు.
ఈ స్మృతుల అమలు ఫలితంగా మద్య యుగాలలో “సతి “అనేది మహిళలను సజీవ దహనం చేసే అమానుషంగా మారింది.
పీడిత వర్గాలు పెళ్ళి చేసుకున్న అమ్మాయిని మొదటి మూడు రాత్రులు అనుభవించే హక్కును బ్రాహ్మణులు కలిగి ఉన్నారు.
శీల రక్షణ పేరుతో పది సంవత్సరాలు కూడా నిండని బాలికలకు వృద్దులతో బాల్యవివాహాలు చేశారు.
రాజా రామ మోహన రాయ్, ఈశ్వర చంద్ర విద్యా సాగర్, మహాత్మా ఫూలే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మొదలయిన సామాజిక సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బ్రిటీషు ప్రభుత్వం ఈ దుర్మార్గాలను, అమానుషాలను చట్టాల ద్వారా రద్దు చేసింది. వీటిని రద్దు చేయించిన మహనీయులకు, రద్దు చేసిన బ్రిటీషు ప్రభుత్వానికి భారత ప్రజలు ఋణపడి వున్నారు.
అందుకనే అనేక సామాజిక దురాచారాలకు మూలంగా వున్న మనుస్మృతిని; పీడిత వర్గాలకు విద్యాహక్కు, ఆస్తి హక్కు ఇవ్వని మనుస్మృతిని మహిళలు కామ కేంద్రాలు అని, పురుషుడి నిగ్రహాన్ని చెడగొట్టేందుకు పుట్టించ బడిన వారని, స్త్రీ పురుషుడి పడక సుఖానికి, పిల్లలను కనడానికి, వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలని చెప్పిన మనుస్మృతిని తీవ్రమైన ఆగ్రహంతో మహనీయుడు అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 న మహద్ పట్టణంలో తగల పెట్టాడు.
తాను రాసిన భారత రాజ్యాంగంలో పీడితులకు
1. విద్యా హక్కు
2.ఆస్తి హక్కు
3. మహిళలకు అనేక హక్కులు కల్పించాడు.
పై విషయాల పట్ల తన నిబద్దతను చాటుకున్నాడు. మన దేశ ప్రజా స్వామిక విప్లవానికి అంబేద్కర్ పునాదులు వేశాడు.
అంబేద్కర్ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. తన భావజాలం కలిగిన బ్రాహ్మణుడిని కూడా తన కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసిన అంబేద్కర్ ఆచరణను మనం గమనించాలి. పుట్టుక ఏ ఒక్కరి చేతిలో వుండదు. ప్రగతిశీల భావజాలం ఏర్పరచుకోవడం అనేది తమ చేతిలోనే వుంది. అంబేద్కర్ ఆలోచనలను అంగీకరించే ఆధిపత్య కులాల నుండి వచ్చిన వారిని, మీరు ఆధిపత్య కులాల వారు అని కొందరు అంబేద్కర్ వాదులు ఛీదరించుకుంటున్నారు. అంబేద్కర్ సాహిత్యం మరియు ఫూలే సాహిత్యం వీరు చదవలేదని అర్ధం అవుతుంది. చదివిన వారికి స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే వారిద్దరూ ఆధిపత్య భావజాలాలను, బ్రాహ్మణిజాన్ని, మనువాదాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు తప్ప ఏ ఇతర కులంలో పుట్టిన వ్యక్తులను కాదు. అంబేద్కర్ - ఫూలేలకు అనేక మంది బ్రాహ్మణ మిత్రులు ఉన్నారని వారి సాహిత్యం చదివితే అర్ధం అవుతుంది.
నేటి ఫాసిస్టు సంఘపరివార్ అగ్ర కుల పాలకులు మనుస్మృతిని నూతన రాజ్యాంగంగా తెచ్చే ప్రయత్నాలలో వున్నారు .
దానిని తిప్పి కొట్ట వలసిన బాధ్యత అంబేద్కర్ వాదుల మీదనే కాదు సమస్త వామపక్ష, బహుజన, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తుల మీద వుంది.
జేజేలు అంబేద్కర్ కు!
మనుస్మృతి నశించాలి!
మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చే కుట్రలను తిప్పి కొట్టాలి!
జై భీమ్!
