Manda Krishna betrayed the Madiga Caste
మీ అందరికి తిండి, బట్ట, ఇల్లు, వైద్యం కల్పించడం ప్రభుత్వ విధి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా మీ అంగీకారంతో జరగాలి. ప్రాపంచికమైన అన్ని ఆనందాలకూ చట్టమే ఆనవాలు. శాసన నిర్మాణాధికారాన్ని చేజిక్కించుకోండి. అదే మీకు విమోచన మార్గం - డాక్టర్ బిఆర్. అంబేద్కర్
కేంద్రంలోని అధికార పార్టీ నవంబర్ 7, 2023 రోజున మాదిగ విశ్వరూప ‘ఎన్నికల ముసుగు’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అంటే అన్ని కులాలకు సమానంగా ఉండవలసిందిపోయి ఒక వర్గానికి కొమ్ము కాయడం సిగ్గు చేటు. మరోపక్క 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్నే మార్చివేసి రిజర్వేషన్లనే తొలగిస్తామని కాషాయపు పార్టీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. లక్షలాదిమంది సాక్ష్యంగా అదే పార్టీ అగ్రనేత కాళ్లుపట్టుకొని, అదే కాషాయపు పార్టీకి ఓట్లు వేయమనడం మంద కృష్ణ మాదిగకే చెందుతుంది. దళిత జాతి రిజర్వేషన్ హక్కులను తొలిగించాలనుకునే పార్టీకి ఓటువేయమనడం/ఓటువేయడం అనేది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంతో సమానం అవుతుంది. స్వలాభం కోసం రిజర్వేషన్ ఫలాలను తుడిచిపెడతానని బహిరంగంగా ప్రకటించిన వారికి ఓటు వేయమని చెప్పి తన మాదిగ జాతికే ద్రోహం చేసిన ఘనత అలానే తన జాతి నాశనానికి కారణం కాబొయ్యే మంద కృష్ణ మాదిగకే చెల్లుబాటు అవుతుంది.
1985 కారంచేడు ఊచకోతకు వ్యతిరేకంగా జరిగిన ఐక్య ఉద్యమ ఫలితంగానే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వచ్చింది. 1991 చుండూరు ఊచకోత సంఘటనలో ఐక్య ఉద్యమం అగ్రకులాలను దోషిగా నిలబెట్టింది. పైరెండు ఉద్యమాలు మాలల నాయకత్వంలో జరిగి, ఫలితంగా ఆంధ్ర అగ్రవర్ణాలకు మాలలు శత్రువులైనారు.
1994లో బీఎస్పీ అధినేత కన్షీరాం ఆంధ్ర మాలల సహకారంతో దక్షిణ భారతంలో తన రాజకీయ విస్తరణ చేస్తున్న రోజుల్లో ఆనాటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి, పచ్చ జెండా అధ్యక్షుడు ఆంధ్ర మాలలతో వారికున్న వైరం కారణంగా బీఎస్పీని నిలువరించడానికి ఎమ్మార్పీఎస్ అండదండలు తీసుకోవటంతో మొదలుకొని, 2023 లో మాదిగ వ్యక్తి తన ఉన్నతోద్యోగం వదులుకొని బీఎస్పీ పగ్గాలు చేపట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మాదిగలే ఓట్లేయని సందర్భం దాకా మాదిగల రాజకీయ, సామాజిక ద్రోహం అనేకమార్లు ఋజువైంది. ఎమ్మార్పీఎస్ ఏర్పాటు అనంతరం జరిగిన 1998 వేంపేట, 2012 లక్ష్మిపేట ఊచకోత సంఘటనల్లో దళిత ఐక్య ఉద్యమం నీరు కారడానికి మాలలతో మాదిగలు కలసిరాకపోవడమే కారణం. ఇలా సామాజిక, ఐక్య ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర మాదిగలది.
