వీర భయంకర మాల కన్నమదాసు చరిత్ర
మాల కులం - చారిత్రక వీరత్వం
తెలుగు నేల మీద మాలల వీరత్వానికి, నిజాయితీకి, యుద్ధ నైపుణ్యాలకు చరిత్రలో, కోకొల్లలుగా సాక్ష్యాలు లిఖించబడ్డాయి. అందులో అతి ముఖ్యమైనది. పల్నాటి మాల కన్నమదాసు చరిత్ర. పల్నాటి చరిత్ర తెలుగులో తొలి వీరగాథ.
కన్నమదాసు చరిత్ర (History of Mala Kannamadasu)
'కన్నమదాసు' గారి గురించి వీరచరిత్రల గాథలో ఈ విధంగా చెప్పబడింది.. ‘‘మాలలకు బుట్టి మాలనైపోక/ విష్ణు పాదముబట్టి విశ్వంబులోన/ తెప్పలి నాయుడు తెరవైనట్టి/ వికబాబ్జ లోచన పెమ్మ సానికిని/ శ్రీమించు చెన్నుని మేన/ పెంపొందు తులసి పెదవనమాల/ వరమున గన్నట్టి వరపుణ్యసుతుడ/ కన్నమ నాపేరు కమలాక్షి వినవె’’ - పల్నాటి వీరచరిత్ర - పింగళి లక్ష్మీకాంతం - కల్లు ప్రతిష్ట - పుట సంఖ్య. 307.
11వ శతాబ్దం లో మాచర్ల సేనలకు సర్వ సైనాని గా భాద్యత నిర్వర్తించి, బ్రహ్మనాయుడికి నమ్మిన బంటుగా కడవరకు నిలిచి చరిత్రలో, పల్నాటి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిన మహా వీరుడు కన్నమదాసు. కన్నమదాసు తండ్రి తెప్పల నాయన్న, తల్లి పెమ్మసాని.
కన్నమ తండ్రి తెప్పలనీడు పల్నాటి రాజ్యస్థాపకుడైన అనుగు రాజు ఆస్థానంలో సైన్యాధ్యక్షుడు. ఈయన బ్రహ్మనాయుడి తండ్రి దొడ్డ నాయుడితో పల్నాడుకు వలస వచ్చాడు. కన్నమనీడు తండ్రి తెప్పలనీడు నేతృత్వంలో జరిగిన ‘కోరుట్ల’ కదనంలో విజయం సొంతమైంది. ఈ యుద్ధం అనంతరం ‘అరణగండ్ల’ యుద్ధానికి దారితీసి పల్నాటి రాజ్యస్థాపనకు దోహదం చేసింది. కన్నమ తల్లి పేరు పెమ్మసాని. ఆమెను చాపలమ్మ అని కూడా అంటారు. తెప్పలనీడు అరణగండ్ల యుద్ధంలో వీర స్వర్గం పొందాడు.
చాలా మంది కన్నమదాసుడుని, బ్రహ్మనాయుడు ఏదో దయతలచి పదవి ఇచ్చాడని చెబుతారు కానీ అది నిజం కాదు. అనుగురాజు మరణానంతరం ఆయన తొలి పురుష సంతానం నలగామ రాజుకు సింహాసనం దక్కినట్లు, దొడ్డనాయుని మరణం తర్వాత ఆయన కుమారుడు బ్రహ్మానాయుడికి మంత్రి పదవి లభించినట్లు, తెప్పలనీడి సైన్యాధ్యక్ష పదవి ఆయన పుత్రుడైన కన్నమదాసుకు దక్కాలని పరంపర హక్కుగా రాచరిక సాంప్రదాయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో కన్నమదాసును బ్రహ్మనాయుడే సైన్యాధ్యక్షునిగా నియమించాడని చెప్పడం వివేకం అనిపించుకోదు.
వీరత్వానికి ప్రతీక మాల కన్నమదాసు
చిన్నప్పటి నుండే కన్నమదాసుకు పట్టుదల, వీరత్వం, భయపడని గుణం తల్లి తండ్రులు నేర్పారని చెపుతారు. పల్నాటి చరిత్ర మనకు మొదటిగా తెలిపిన శ్రీనాధ కవి సార్వభౌమ(ఆయన కాలం 1365-1441) తన పల్నాటి వీరచరిత్ర గ్రంధంలో కన్నమ దాసు అరివీర భయంకరుడుని, మహా వీరుడని తెలిపారు. ఆ రోజుల్లో కన్నమదాసును "కన్నమనీడు", "రాజామాల కన్నమ దాసు" అని, ప్రజలు పిలిచేవారని తెలిపారు.
1170 సంవత్సర ప్రాంతంలో కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్దం, పల్నాటి వీరుల వీరత్వం గురించి వారి తదనంతరం మహాదేవి చర్ల(మాచర్ల), గురజాల, కారంపూడి ప్రజలు బుర్రకధల రూపంలో, కథల రూపంలో చెప్పుకోవటం చూసి అప్పట్లో 15వ శతాబ్దంలో పల్నాటి ప్రాంతం పక్కనే కొండవీడు రెడ్డి రాజుల వద్ద ఆస్థాన కవిగా ఉన్న శ్రీనాధుడు ఉత్తేజితుడై పల్నాడులో పలు ప్రాంతాలు తిరిగి పల్నాటి చరిత్ర గురించి పరిశోధనలు చేసి "పల్నాటి వీరచరిత్ర" గ్రంధం రచించారు.
కన్నమదాసు వీరత్వం గురించి చరిత్రకారులు చెప్పిన విశేషాలు
కవి శ్రీనాధుని మాటల్లో - కన్నమదాసు కదన రంగంలో కి వస్తే శత్రు సైన్యం లక్షమంది ఉన్న చెమటలు పట్టేవట, యుద్దరంగాన ఆయన గుర్రం పరుగెత్తే గిట్టల శబ్దం కూడా శత్రువులను భయకంపింతులను చేసేది, దేవుడా ఆ మహావీరుడు మా వైపుకాక మరో వైపు వెల్లేలా చూడు అని కోరుకునేవారట. ఈయన కత్తితో చేసే వీరవిహారం చూసే శత్రు రాజులు ఈయనకు ఎదురు కాకుండా తప్పించుకునెడివారట. పల్నాటి యుద్దంలో గొప్ప వీరులు బాలచంద్రుడు లాంటి మహావీరులు మరణించినను, కన్నమదాసు సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న గారి సహకారంతో నాగమ్మ ను ఓడించి మాచర్ల కు విజయాన్ని చేకూర్చాడు.
ఆచార్య యార్లగడ్డ మాటల్లో - కన్నమదాసు రాజాజ్ఞను పాటించటంలో గొప్ప విధేయుడని, అత్యంత సమయస్పూర్తి గలవాడని అనేక క్లిష్ట సమయాల్లో చతురతతో వ్యవహరించి మాచర్ల పాలకులను కాపాడారని ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు రాసిన "పల్నాటి వీరచరిత్ర పుస్తకం" లో కన్నమదాసు ను వర్ణించారు.
విదేశీ పరిశోధకులు రోగర్ మాటల్లో - కన్నమదాసు వాడిన ఆయుధాలు ఇతర ఏ వీరులు వాడలేదని ఆయన చేతిలో భయంకర ఖడ్గం ఉండేదని, దాని బరువు అధికమని, ఆయనను దగ్గర నుండి చూస్తేనే శత్రువులకు పై ప్రాణాలు, పైనే పోయేవని పల్నాటి చరిత్ర పై పరిశోధన చేసి "ఎధిక్ ఆఫ్ పల్నాడు" అనే పరిశోధన గ్రందాన్ని రచించిన రోగోర్ అనే విదేశీ చరిత్ర కారుడు తెలిపారు.
అలాగే బ్రహ్మన్నకు శత్రువుల నుండి కలిగే ముప్పును కూడా అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడే వాడని, కన్నమ దాసు పక్కన ఉండగా బ్రహ్మనాయుడుని ఎవరు ఏమి చేయలేరనే నానుడి అప్పట్లో ఉండేదని తెలిపాడు.
మాలల వీరత్వానికి సజీవ సాక్ష్యాలు - పల్నాటి వీరగాధలు
12వ శతాబ్ది నాటి పల్నాటి చరిత్ర 15వ శతాబ్ది వరకూ 300 సంవత్సరాలపాటు మౌఖికంగా ప్రయాణించింది. 15వ శతాబ్దిలో కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానకవి, విద్యా శాఖామంత్రి అయిన శ్రీనాథ మహాకవి తొలుతగా రికార్డ్ చేశారు.
పల్నాటి చరిత్ర తెలుగులో తొలి వీరగాథ. ఈ గాథను బ్రహ్మనాయుడి పక్షాన కారంపూడి కథలని, నాయకురాలు నాగమ్మ పక్షాన గురజాల కథల నామంతో పిచ్చుకుంట్లవారు శతాబ్దాలుగా గానం చేస్తూ వచ్చారు. ఈ కథా గానం ఆయా కుటుంబాలలో వంశపారంపర్యంగా తరతరాలుగా కొనసాగుతూనే వుంది.
ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21వ తేది నుంచి ప్రారంభమై 25 వరకూ ఐక్య పల్నాటి రాజథాని కారంపూడిలో అయిదు రోజులపాటు నాటి పల్నాటి వీరులనూ స్మరించుకుంటూ ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీన ప్రధాన "సిడిమానోత్సవం"తో ఈ సంబరాలు ముగుస్తాయి.
